కలం, వెబ్ డెస్క్: గోవా నుంచి ఢిల్లీ వరకు ఎక్కడైనా వెజిటేరియన్ ఫుడ్ కావాలంటే అందరి కళ్లూ ముందుగా వెతికేది ఉడుపి హోటల్ (Udupi Restaurants) కోసమే. అందులో సందేహం అక్కర్లేదు. ఉడుపి హోటళ్లో వాళ్లు ఏం సర్వ్ చేసినా.. అది పక్కాగా వెజిటేరియన్ ఫుడ్డే అవుతుందని కళ్లు మూసుకుని లాగించేస్తాం. దేశంలోని ప్రతి నగరంలో ఉడుపి హోటల్ కనిపించడం కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. చాలామంది ఉడుపి హోటల్ అంటే దక్షిణ భారతదేశ వంటకాలకు పెట్టింది పేరుగా, అక్కడ అవే సర్వ్ చేస్తారన్న భావనలో కూడా ఉంటారు. నిజంగానే ఉడుపి హోటల్ అంటే ఇడ్లీ-సాంబార్, దోశ-కొబ్బరి చట్నీ మాత్రమేనా అంటే కాదు.. వీటి వెనక ఒక అద్భుతమైన చరిత్ర దాగుంది.
ఉడుపి అనే పేరు కర్ణాటక తీరంలో ఉన్న ఆలయ పట్టణం నుంచి వచ్చింది. 13వ శతాబ్దంలో మాధ్వాచార్యులు స్థాపించిన శ్రీకృష్ణ మఠంలో శివళ్లి మాధ్వ బ్రాహ్మణులు శతాబ్దాల పాటు దేవాలయ వంటలు చేశారు. శుభ్రత, క్రమశిక్షణ, సరళతే ఈ వంటల ప్రధాన లక్షణాలుగా ఉండేవి. ఇరవయ్యో శతాబ్దంలో ఆర్థిక పరిస్థితులు మారడంతో ఈ ప్రాంతానికి చెందిన వారు ఉద్యోగాల కోసం పెద్ద నగరాల వైపు వలస వెళ్లారు. తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకునే మార్గంగా ఆహారాన్ని ఎంచుకున్నారు. మద్రాస్, బెంగళూరు వంటి నగరాల్లో చిన్న శాకాహార హోటళ్లకు అలా శ్రీకారం చుట్టారు.
ముంబయిలో మటుంగాలో ప్రారంభమైన ఉడుపి శ్రీకృష్ణ బోర్డింగ్ ఈ ప్రయాణానికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. 1942లో రామ నాయక్ స్థాపించిన ఈ హోటల్ తక్కువ ధరలో సాదా భోజనంతో వలసవాదులకు ఇంటి రుచిని అందించింది. ఆ తర్వాత దశాబ్దాల్లో ముంబయి అంతటా ఉడుపి హోటళ్లు విస్తరించాయి. కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలకు ఇవి నమ్మకమైన భోజన కేంద్రాలుగా మారాయి. కాలక్రమేణా ఉడుపి హోటళ్లు దక్షిణ భారతానికే పరిమితం కాలేదు. శ్రీనగర్ నుంచి విదేశాల వరకు ఈ పేరు చేరింది.
ఆసక్తికరంగా, ఉడుపి వంటగా గుర్తించే ఇడ్లీ, దోస మొదట ఈ ప్రాంతానికే పరిమితం కావు. అవి దక్షిణ భారతం అంతటా ఉన్న వంటకాలు. ఉడుపి హోటళ్ల విస్తరణతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. సమయం మారేకొద్దీ కొన్ని ఉడుపి హోటళ్లు స్థానిక అభిరుచులకు తగ్గట్టు మార్పులు చేసుకున్నాయి. కొన్ని చోట్ల మాంసాహారం కూడా మెనూలో చేరింది. అయినా మూలంలో ఉన్న సరళత మాత్రం కొనసాగింది.
ఉడుపి హోటళ్లు ఒకే సంస్థకు చెందినవని చాలామంది అనుకుంటారు. వాస్తవం మాత్రం వేరే. ఇవన్నీ కుటుంబాల ఆధ్వర్యంలో స్వతంత్రంగా ప్రారంభమైన హోటళ్లు. వుడ్‌ల్యాండ్స్, ఎంఎటిఆర్, దస ప్రకాశ్, సాగర్ రత్న వంటి బ్రాండ్లు అందుకు ఉదాహరణలు. ఉడుపి అనే పదం ఒక బ్రాండ్ కాదు. అది ఒక శైలి మాత్రమే. కాబట్టి ఇంకోసారి ఉడుపి రెస్టారెంట్‌లో భోజనం చేస్తే అది కేవలం ప్లేట్‌లో ఉన్న ఆహారం మాత్రమే కాదు. వలసల కథ, సంప్రదాయాల ప్రయాణం, భారతీయ ఆహార చరిత్రలోని ఒక అధ్యాయం అని గుర్తు చేసుకోండి.


