కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం (Summer Power Supply) భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, డిమాండ్‌కు తగినట్లుగా పంపిణీ వ్యవస్థను ఇప్పటి నుంచే పటిష్టం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం (Khammam) సర్కిల్ పర్యటనలో భాగంగా ఆయన మధిర, బోనకల్, వైరా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వేసవి కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
తొలుత మధిర (Madhira) డివిజన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమైన సీఎండీ వేసవి సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. వేసవిలో పెరగనున్న విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్‌లు) సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా పూర్తి చేయాలి..
అనంతరం మధిర పట్టణంలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో నిర్మాణం పూర్తిచేసుకున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సీఎండీ సందర్శించారు. ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
సబ్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి..
అక్కడి నుంచి వైరా (Wyra) చేరుకున్న సీఎండీ, పట్టణంలో నూతనంగా ప్రతిపాదించిన 33/11 కేవీ శాంతినగర్ సబ్‌స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పనులు చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే విధంగా వైరా పట్టణంలో నిర్మించనున్న డివిజన్, సబ్ డివిజన్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల (ఈఆర్‌ఓ) స్థలాలతో పాటు, వైరా రోడ్డులో నిర్మించనున్న ఇండోర్ సబ్‌స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఖమ్మం ఆపరేషన్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాస చారి, డీఈలు రామారావు (ఖమ్మం టౌన్), శ్రీనివాస్ (మధిర), రమేష్ (వైరా), ఆపరేషన్, కన్‌స్ట్రక్షన్ ఏడీఈలు, వైరా రూరల్ ఏఈలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

