కలం, సిరికొండ : సిరికొండ మండలం కుంటగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పాలవాగు (Palavagu) గ్రామంలో నూతనంగా నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల (Tribal Welfare School) భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని సూచించారు.
ఆధునిక వసతులతో పాఠశాల అందుబాటులోకి రావడంతో పాలవాగు గ్రామ విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కలగనుంది. నూతన పాఠశాల భవనం ప్రారంభం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరవింద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్‌షావ్, సర్పంచ్ మీరాబాయి, జిల్లా సర్మెడి అమృతరావు, గ్రామ పటేల్ పెందుర్ భీంరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

