తెలంగాణ తల్లి చీర వివాదంలో ట్విస్ట్.. సీసీటీవీతో క్లారిటీ

కలం, నల్లగొండ: నల్లగొండలోని(Nalgonda) తెలంగాణ తల్లి విగ్రహానికి(Telangana Thalli Statue) బతుకమ్మ చీర కట్టిన ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే, ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం లేదని, గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భక్తితో చీరలు కట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వెల్లడైందని పోలీసులు వివరించారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆదివారం ఉదయం తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరను కట్టింది. ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన చీర కట్టడంపై నిరసన తెలిపారు. అనంతరం విగ్రహానికి ఉన్న చీరను తొలగించి, పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మళ్లీ చీర కట్టడంతో మరోసారి వివాదం

మరుసటి రోజు ఉదయం తెలంగాణ తల్లి విగ్రహానికి మరో చీర కనిపించడంతో బీఆర్ఎస్ నాయకులు మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విగ్రహం వద్ద ఉన్న మహిళను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తాను గాంధీనగర్ నుంచి వచ్చానని, తెలంగాణ తల్లిపై భక్తితో తన వద్ద ఉన్న చీరలను విగ్రహానికి కట్టినట్లు ఆమె తెలిపింది.

సీసీటీవీ ఫుటేజీతో స్పష్టత

ఈ ఘటనపై మరోసారి నిరసనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డీఎస్పీ శివరాం రెడ్డి స్పందించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని, సదరు మహిళే భక్తితో విగ్రహానికి చీరలు కట్టినట్లు బీఆర్ఎస్ నాయకులకు వివరించారు. దీంతో నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఓ మహిళ భక్తితో చేసిన పనితో ప్రారంభమైన ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీయగా, సీసీటీవీ ఫుటేజీ పరిశీలనతో పరిస్థితి సద్దుమణిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>