నగల దుకాణంలోకి చొరబడి బీభత్సం.. యజమానిపై కత్తితో దాడికి యత్నం!

కలం, నేషనల్ డెస్క్ : రాజస్థాన్‌లోని కోటా (Kota) గరంలో దుండగులు రెచ్చిపోయారు. నగల దుకాణంలోకి (Jewellery Shop) ముసుగులు ధరించి ప్రవేశించిన ఇద్దరు యువకులు షాపు యజమానిపై దాడికి తెగబడ్డారు. కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే దుండగులకు భయపడకుండా యజమాని ధైర్యంగా ఎదురుతిరగడంతో వారి ప్రయత్నం విఫలమైంది. కోటాలోని రంగ్‌బారి ప్రాంతంలో ఉన్న వినాయక్ జ్యువెలర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు షాపులోకి ప్రవేశించి హఠాత్తుగా యజమాని వినోద్ సోనీపై దాడి చేశారు.

తొలుత ఆయన ముఖంపై కాలితో తన్నారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రాణాలకు తెగించి మరీ వినోద్ సోనీ దుండగులను ప్రతిఘటించారు. వారి దాడికి వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడటంతో నిందితులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. పట్టపగలే నగల దుకాణంలోకి చొరబడి యజమానిపై దాడికి యత్నించడం స్థానికుల్లో భయాందోళనలకు కారణమైంది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>