కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రజలకు ప్రభుత్వ పరిధిలోనే ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించింది. ఆయన చొరవతో ప్రభుత్వం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి శుక్రవారం రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ సేవలు బలోపేతం కానున్నాయి. గుండె సంబంధిత సమస్యల కోసం అధునాతన క్యాథ్ ల్యాబ్, ఉచిత ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయం, ప్రత్యేక క్రిటికల్ కేర్ యూనిట్, 20 పడకల ఐసీయూ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
గతంలో అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై స్థానిక జీజీహెచ్‌లోనే అత్యున్నత వైద్యం ఉచితంగా లభించనుండటంతో జిల్లా ప్రజలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే తమ ఆశయమని కూనంనేని స్పష్టం చేశారు.

