కలం, వెబ్ డెస్క్: ఏఐసీసీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Telangana Congress) నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వీహెచ్, టీపీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా (Delhi Congress Protest) చేపట్టారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఇండి కూటమి నేతలు గత మూడు రోజులుగా ధర్నాలు చేయడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ ఇతర ముఖ్య నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రాసెస్ లో తప్పులు జరిగాయని.. అందువల్లే దేశంలో ఓట్ చోరీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ అనుకూల ఓట్లను తొలగించకుండా.. తమ ఓట్లను తొలగిస్తున్నారని ఇండి కూటమి నేతలు ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలకు మద్దతుగా పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని నిరసన తెలుపుడంతో గత 3 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే ఇండి కూటమికి నష్టం చేకూరుతోందని.. దేశంలో ప్రజాస్వామ్యం నశిస్తోందని తీవ్ర స్థాయిలో నేతలు నిరసన తెలిపారు. ఇండి కూటమికి తోడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు.
సీఈఓ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండి కూటమి శ్రేణులు నిరసన తెలుపుతుంటే మరోవైపు సీజేపీ శ్రేణులు సైతం ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న ధర్నాలతో దేశరాజధాని అట్టడుకుపోయింది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు ధర్నాలు చేస్తూనే ఉంటామని ఇండి కూటమి నేతలు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అటు ఇండి కూటమిలోని వేర్వేరు పార్టీలు సైతం ధర్నాకు మద్దతుగా తరలిరావాలని తమ పార్టీ కేడర్ ను ఆదేశించాయి. కేంద్రం తలొగ్గి సీఈఓ జ్ఞానేష్ కుమార్ ను తన పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, వీహెచ్, ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఏఐసీసీ ‘ఛలో ఢిల్లీ’ పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా చేపట్టామని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చామని చెప్పారు.. ప్రజాస్వామ్యానికి బలమైన పునాది ఓటు హక్కు అని.. కేంద్రం ఓటు హక్కును చోరీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ మాత్రమే గెలిచేలా SIR పేరుతో అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఆందోళనలు కాంగ్రెస్ కోసం కాదని.. అందరి ఓటు హక్కును కాపాడటం కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. కాగా, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పోలీసుల నిషేధం విధించారు. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

