కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది డిసెంబర్ 7 నాటికి మూడేళ్లు పూర్తికానున్నాయి. ఇంతకాలం గడుస్తున్నా కీలకమైన పదవులు ఇంకా ఖాళీగానే ఉండటం రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శాసనసభలో ప్రభుత్వానికి కీలకమైన చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నియామకాలు జరగకపోవడం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున చీఫ్ విప్ పదవిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. తొలుత నలుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించగా, వారిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం మరో ముగ్గురిని విప్‌లుగా నియమించారు. ప్రస్తుతం ఆరుగురు ప్రభుత్వ విప్‌లు కొనసాగుతున్నారు. అయితే కీలకమైన చీఫ్ విప్ పదవిని మాత్రం భర్తీ చేయకపోవడం వెనుక మంత్రివర్గ విస్తరణ అంశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.
మంత్రివర్గ విస్తరణతో ముడి?
ఇటీవల కొండా సురేఖను తొలగించడంతో పాటు ఇతర కారణాలతో కలిపి ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. గతంలో తరచూ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల కాలంలో ఈ అంశంపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఆశావహుల్లో కొందరికి మంత్రి పదవులు దక్కకపోతే అసమ్మతి స్వరాలు వినిపించే అవకాశం ఉందన్న అంచనాలతోనే విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవి భర్తీని కూడా మంత్రివర్గ విస్తరణతో ముడిపెట్టి చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇతర కీలక పదవుల కేటాయింపులో భాగంగా చీఫ్ విప్‌ను నియమించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఈ పదవిని భర్తీ చేయకపోవడంపై కొందరు పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
రాంచంద్రనాయక్ ‘మంత్రి’ పట్టు
డిప్యూటీ స్పీకర్ భర్తీ కూడా పెండింగ్‌లోనే ఉన్నది. తొలుత ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన వారిలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు. అనంతరం గతేడాది జూన్‌లో ఆయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలను కోరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్టీ కోటా నుంచి బంజారా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని, ఆ కోటాలో తనకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగానే కొనసాగుతున్నది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ, చీఫ్ విప్ నియామకం, డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ అంశాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ కీలక పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠగా మారింది.

