కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి జెడ్పీ చైర్మన్ (AP ZP Chairman) ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 27 జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాలపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై నేడు లేదా రేపు తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం, టీడీపీకి 21 నుంచి 22 స్థానాలు దక్కే అవకాశం ఉండగా, జనసేనకు 4 నుంచి 5, బీజేపీకి ఒక స్థానం ఇచ్చే యోచనలో కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసం ఐదు జెడ్పీ చైర్మన్ స్థానాలు కావాలని, వీలైతే మరిన్ని స్థానాలు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది.
ముఖ్యంగా శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ జెడ్పీ చైర్మన్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు పశ్చిమ గోదావరి, అనకాపల్లి, శ్రీ సత్యసాయి స్థానాలపైనా కూటమి పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది. మరోవైపు, కడప జెడ్పీ చైర్మన్ పీఠం కోసం టీడీపీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఖరారు ఆసక్తికరంగా మారింది.

