కలం, వెబ్ డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) గడువును (SIR Shedule) కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న షెడ్యూల్ లో మార్పులు చేసింది. నవంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా దాన్ని డిసెంబర్ 22 వరకు పెంచింది.
అలాగే.. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్డీడీ) క్యాటగిరీ ఓటర్ల కోసం ఎన్యూమరేషన్ ఫారాల తయారీ, ముద్రణ ప్రక్రియను నవంబర్ 18లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణను నవంబర్ 18 నుంచి 30 వరకు చేపట్టాలని పేర్కొంది. సేకరించిన ఫారాల పరిష్కార ప్రకియను డిసెంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సందీప్ కుమార్ లేఖ జారీ చేశారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

