కలం, ఖమ్మం బ్యూరో: ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న కళ్లలో ఎట్టకేలకు ఆనందం కనిపించింది. ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో నీటి కోసం ఎదురుచూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project) ప్రస్తుతం వరద నీటితో కళకళలాడుతోంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానిక చింతవాగు, రొటెంత్ వాగు, పగిడివాగులు ఉప్పొంగి తాలిపేరు జలాశయంలో కలుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం సెకనుకు 72,447 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరువవుతోంది.
వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు భద్రత చర్యల్లో భాగంగా గేట్లను ఎత్తి అదనపు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 13 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఉంచగా, మరో 11 గేట్లను ఫ్రీ-ఫ్లో విధానంలో కొనసాగిస్తున్నారు. మొత్తం దాదాపు 84,376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏఈఈ సంపత్ నేతృత్వంలోని ఇంజనీరింగ్ బృందం క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరగడంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తాలిపేరు ప్రాజెక్టు పరిధిలోని 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్య తీరే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత కారణంగా ఆలస్యమైన వరి నాట్ల పనులను రైతులు వేగవంతం చేస్తున్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, నదులు దాటేందుకు ప్రయత్నించవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

