కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup)లో అసలైన సమరం వచ్చేసింది! కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ (IND vs WI) జట్ల మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక నాకౌట్ యుద్ధం. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్తుండగా, ఓడిన జట్టు ఇంటికి వెళ్లడమే ఇక. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ పదేళ్ల క్రితం నాటి అంటే 2016 హిస్టరీ రిపీట్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు. 2016లో ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్‌ను ఓడించి, విండీస్ ట్రోఫీ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేదిక, జట్లు మారినప్పటికీ ఫలితం అలాగే ఉంటుందని సామీ ఆశిస్తున్నారు.
టోర్నీ గెలవాలంటే భారత్ వంటి బలమైన జట్టును దాటుకుని వెళ్లాలని, రేపు ఆ సమయం తమకు రాబోతోందని ఆయన పేర్కొన్నారు. షాయ్ హోప్ నాయకత్వంలోని తమ జట్టు ఆటగాళ్ల ఏకాగ్రత, సన్నద్ధత చూస్తుంటే ఏదో అద్భుతం జరగబోతోందని తనకు నమ్మకం ఉందని సామీ వెల్లడించారు. వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో (T20 World Cup) ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 66 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కూడా 63 సిక్సర్లతో గట్టి పోటీ ఇస్తోంది. విండీస్ జట్టులో పటిష్టమైన స్పిన్ అటాక్, వైవిధ్యమైన సీమర్లు, భారీ హిట్టర్లు ఉండటంతో ఆదివారం హై-స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: బాబర్ భవిష్యత్తుపై స్పష్టత అవసరం: పుజారా
Follow Us On: Youtube

