కలం, నిర్మల్: రీసర్వే ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా (Nirmal Collector) కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన వ్యవసాయ భూముల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టిందన్నారు. సర్వే అధికారులకు రైతులు సహకరించాలని తెలిపారు. రీసర్వే నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రైతులు అందుబాటులో ఉండాలని చెప్పారు. రీసర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత అధికారుల బృందం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి సంబంధించి భూముల వివరాలు, చేపట్టిన సర్వే వివరాలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్ నరసింహమూర్తి, తహసీల్దార్ సంతోశ్, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ సాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

