కలం, వెబ్ డెస్క్ : రూ.2,000 దాటిన కమర్షియల్ యూపీఐ (పర్సన్ టు మర్చంట్) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు (UPI Charges) విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ అంశంలో ప్రభుత్వం వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం, ఆర్బీఐ, NPCI లతో పాటు యూపీఐ స్టీరింగ్ కమిటీకి నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం చట్టపరమైన విషయమే కాకుండా సాంకేతిక, ఆర్థిక ప్రక్రియతో ముడిపడి ఉన్న అంశంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఏ చట్టబద్ధమైన ప్రాతిపదికన ఈ ఛార్జీలను నిర్ణయించారు? వసూలైన మొత్తం ఎవరెవరికి, ఏ ప్రాతిపదికన పంపిణీ అవుతుందనే వివరాలపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
అయితే అంతకుముందు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. డిజిటల్ చెల్లింపుల గేట్‌వేను వాడే దాదాపు 96 శాతం మంది సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల (UPI Charges) నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి అమలు కానున్న ఈ నూతన నిబంధనల ప్రకారం.. రూ.2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం రుసుము (గరిష్టంగా రూ.300) పడనుంది. సాధారణ వ్యక్తుల మధ్య జరిగే (P2P) లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడించింది. కాగా, కేంద్రం జారీ చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌పై, కేంద్రం సమర్పించే సమగ్ర వివరణను పరిశీలించిన తర్వాతే సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.
Also Read : భారత్-నేపాల్ సరిహద్దులో భూకంపం.. భయాందోళనలో ప్రజలు!
Follow Us On : WhatsApp

