కలం, స్పోర్ట్స్: హాకీ ఇండియా ఎన్నికలకు (Hockey India Elections) మార్గం సుగమమైంది. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఎన్నికల వివాదానికి తెరపడినట్లయింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి మరోసారి పోటీ చేసే అర్హత కూడా లభించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై టిర్కీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ వ్యవహారంలో ఒడిశా హాకీ సంఘం సభ్యత్వం కీలకంగా మారింది. ఆ సంఘానికి శాశ్వత సభ్యత్వం కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సభ్యత్వ స్థాయిని తగ్గించాలంటూ హాకీ ఇండియా జారీ చేసిన రెండు షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకుంది. దీంతో ఎన్నికల ప్రక్రియకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.
హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా సభ్యత్వాన్ని శాశ్వత స్థాయి నుంచి అసోసియేట్ స్థాయికి తగ్గించాలని హాకీ ఇండియా నోటీసులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఒడిశా సంఘానికి జనరల్ బాడీలో పాల్గొనే హక్కు, ఓటు వేసే అవకాశం, ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదం కోర్టుకు చేరడంతో ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఒడిశా సంఘం సభ్యత్వ స్థాయి తగ్గితే దిలీప్ టిర్కీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపైనా ప్రభావం పడేది.
తాజా తీర్పుతో ఒడిశా సంఘం శాశ్వత సభ్యత్వం కొనసాగనుంది. టిర్కీకి పోటీ చేసే అర్హత తిరిగి వచ్చింది. అయితే ఒడిశా హాకీ సంఘం లేవనెత్తిన ఇతర అభ్యంతరాలను పరిశీలించేందుకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివాదానికి సంబంధించిన అంశాలను పరిశీలించనుంది.

