కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న జీర్ణోద్ధరణ, అభివృద్ధి, విస్తరణ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత రామాలయ అభివృద్ధి, విస్తరణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. రవీంద్రనాథ్ మాస్టర్ ప్లాన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనుల వివరాలను వివరించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) మీడియాతో మాట్లాడారు. దేవస్థానం ఈవో, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అర్చకుల సలహాలు, సూచనలతో పనులు క్రమపద్ధతిలో సాగుతున్నాయని తెలిపారు.
సుమారు 450 ఏళ్ల క్రితం రామదాసు భక్తిని, నాటి తానీషా కాలం నాటి వ్యవస్థను గుర్తుచేస్తూ, ప్రతి ఆలయానికి ఉండే ప్రత్యేక సంప్రదాయాలను పరిరక్షిస్తూ నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి, విస్తరణ పనులు త్వరగా పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె. దామోదర్ రావు, ఏఈఓ శ్రవణ్ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

