కలం, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ వారిని ఏడిపించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ (Sunke Ravi Shankar) అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఒక హోటల్‌లో సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి రవి శంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు ప్రభుత్వం అంటే.. రైతులపై కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం రైతుల మీద పగపడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొనుగోలుపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సత్యంకు సవాల్ విసిరారు. పగలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారని రాత్రి వేళ దొంగళ్లాగా వచ్చి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఆరోపించారు. కేవలం రీల్స్ కొరకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేసారు. లారీ ఎక్కి స్టంట్లు చేస్తున్నారు తప్ప రైతులకి ఒనగూర్చింది ఏమీ లేదన్నారు.
దమ్ముంటే తనపై కేసు పెట్టాలని, ప్రజలకు తిండి పెట్టే రైతులపై కేసులు పెట్టకండని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేసే రైతులను ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తున్నారని, రౌడీ లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్నాడి దామోదర్ రెడ్డి, మహిపాల్ అనే రైతులపై కేసులు నమోదు చేశారన్నారు. 8 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండిలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. స్తంబంపల్లి కరుణాకర్ అనే యువకుడిపై అక్రమ కేసులు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

