కలం, నిర్మల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కమల్ రోడ్ చిలువేరి భవన్లో ఉన్న శ్రీ వాసవి మాత ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కూరగాయలు, ఆకుకూరలతో అద్భుతంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి సమర్పించిన కూరగాయలతో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోనాల ఉత్సవాల్లో ఆర్యవైశ్య కులస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

