పాలమూరు ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి: జాన్‌ వెస్లీ డిమాండ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని  (Mahabubnagar Hospital) సూపర్ స్పెషాలిటీగా మార్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని పరిశీలిస్తున్న కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన ఆస్పత్రిని విజిట్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రాములు, నాయకులు కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తితో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మీర రంగాతో సిబ్బంది కొరత, మందుల సరఫరా, వైద్య సేవలపై చర్చించారు.

వందలాది పోస్టులు ఖాళీ – సేవలపై తీవ్ర ప్రభావం

ఆస్పత్రిలో సుమారు 100 మంది వైద్యులు, 25 మంది స్టాఫ్ నర్సులు, పలువురు ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులకు సమయానికి వైద్య సేవలు అందడం లేదని జాన్ వెస్లీ తెలిపారు. బోధనా విభాగంలో కూడా తీవ్ర కొరత ఉందని పేర్కొంటూ, 22 మంది ప్రొఫెసర్లకుగాను కేవలం 12 మంది, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను కేవలం 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలు, వైద్య విద్య అందించడం కష్టమన్నారు. ప్రతి 100 పడకలకు 50 మంది శానిటేషన్ సిబ్బంది అవసరమైనప్పటికీ తగిన సిబ్బంది లేదన్నారు. దీనివల్ల రోగులకు ఆస్పత్రిలోనే అంటురోగాలు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేళ్లుగా ఎంఆర్‌ఐ సేవలు నిల్

ఆసుపత్రికి మంజూరైన ఎంఆర్‌ఐ (MRI) యంత్రం రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రోజూ 2,000 మందికిపైగా రోగులు ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, తగిన ల్యాబ్ పరీక్షలు, మందులు అందక పేదలు ప్రైవేట్ వైద్యంతో అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు.

సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు చంద్రకాంత్, ప్రశాంత్, మోయిన్, భరత్, గాలన్న, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>