కలం, కరీంనగర్: బీఆర్ఎస్ నేతలకు కాషాయ రంగును చూస్తే ఎందుకు కడుపుమంట వస్తోందని కరీంనగర్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ (Somidi Venu Prasad) తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతూ ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ భవనాలు, పథకాలు, రోడ్లు, చివరికి ప్రతి ప్రభుత్వ చిహ్నాన్ని గులాబీ రంగుతో నింపేసినప్పుడు లేని తప్పు.. ఇప్పుడు కాషాయ రంగు కనిపిస్తేనే ఎందుకు వస్తోందని నిలదీశారు.
ప్రజలు ఎవరి నమ్మకాల ప్రకారం వారు రంగులను వాడుకుంటే, దానికి కూడా రాజకీయ రంగు పులిమి బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వేణు విమర్శించారు. పదేళ్ల అహంకార పాలనలో రంగుల రాజకీయాలు చేసిన ఆ పార్టీ నేతలకు, ఇప్పుడు ప్రజల్లో వస్తున్న మార్పును, ఆధ్యాత్మిక భావాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పదేళ్లు రాష్ట్రాన్ని గులాబీ మయం చేసినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు కిసాన్ నగర్ లోని జమ్మి గద్దె వద్ద కాషాయ రంగు కనిపిస్తేనే బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడి నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కు ఎందుకు వణుకు పుడుతుందని ప్రశ్నించారు. బీ ఆర్ఎస్ నేతల కడుపుమంటకు కారణం కాలం చెల్లిన వారి రాజకీయ భయమే అనివిమర్శించారు. ఇకనైనా సంకుచిత రాజకీయాలు మానుకుని, ప్రజల మనసులను గెలుచుకునే మార్గం చూసుకోవాలని ఆయన బీఆర్ఎస్ నాయతత్వానికి హితవు పలికారు.

