కలం, సోన్: మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపి హెచ్చరించారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఆదివారం పోలీసులు (Soan Police) వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులతో పాటు వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.

