3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీర తయారీ.. సిరిసిల్ల చేనేత కళాకారుడి ప్రతిభ

కలం, కరీంనగర్ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సిరిసిల్ల (Sircilla Handloom) లో విశిష్ట చేనేత ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అందరినీ అబ్బురపరిచారు. ఆయన సోమవారం తన ఇంట్లో సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 210 నిమిషాల్లో (3 గంటల 30 నిమిషాల్లో) 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేశారు.. అనంతరం అదే చీరను ప్రత్యేకమైన నైపుణ్యంతో మడిచి 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనను మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి పరిశీలించి మాట్లాడారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ భారతీయ చేనేత కళా వైభవాన్ని, తెలంగాణకు గర్వకారణమైన అపూర్వ చేనేత నైపుణ్యాన్ని చాటి చెప్పే సంకల్పంతో ఈ వినూత్నమైన విశిష్ట చేనేత ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం 3 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేసి.. అనంతరం అదే చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి అగ్గిపెట్టెలో పట్టే విధంగా నిర్వహిస్తున్న ప్రదర్శన సిరిసిల్లకు గర్వకారణమన్నారు. ఒక నిబద్ధత, అంకితభావంతో ఈ చీరను అనుకున్న సమయంలో నేయడం ఎంతో శ్రమతో, నైపుణ్యంతో కూడుకున్న గొప్ప విషయమన్నారు.

ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, యువతలో చేనేత రంగం పట్ల ఆసక్తిని పెంచుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి గుర్తింపు తీసుకువస్తూ సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్న వెల్డి హరిప్రసాద్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ఇలాంటి కళాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలను అందించి చేనేత కళ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ ప్రదర్శనను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్, 12వ వార్డు కౌన్సిలర్ సభ్యుడు మొగిలి నాగరాజు, పుర ప్రముఖులు, యువకులు, ప్రజలు తిలకించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>