పటాన్‌చెరులో కాంగ్రెస్–బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనలు.. తీవ్ర ఉద్రిక్తత

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు (Patancheru) పట్టణంలో ఒకే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేపట్టిన ఆందోళనలతో పటాన్‌చెరు బస్ స్టాండ్ ప్రాంతం, ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) రణరంగంగా మారాయి. ఇరు ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు పోటీగా నినాదాలు చేస్తూ ‘నువ్వా-నేనా’ అనే రీతిలో కాలు దువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పటాన్‌చెరు బస్ స్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించగా, వారికి పోటీగా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఏకకాలంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇరు వర్గాలు బలప్రదర్శనకు దిగడంతో NH-65 పై వాహనాల రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తలలు పట్టుకున్న పోలీసులు

ఎటు చూసినా నిరసనకారులు, జెండాలు, హోరెత్తించే నినాదాలతో పటాన్‌చెరు ప్రధాన కూడలి అట్టుడికిపోయింది. ఉన్నట్టుండి ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి, పోటాపోటీ నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్ స్టాండ్ ప్రాంగణంలో, జాతీయ రహదారి వెంట భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>