కలం, వనపర్తి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చించి బుట్టలో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టోకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, దానిని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో సమానంగా భావించాలని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. సహకార సంఘాల ఎన్నికల్లో సింగిల్‌విండో అధ్యక్ష పదవులను అధికార పార్టీ కైవసం చేసుకుంటూ, మరోవైపు ఓటు చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలు తగిన సమయంలో స్పందిస్తారని అన్నారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.
శ్రీశైలం జలాలను పూర్తిస్థాయిలో వినియోగించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు గడుస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదని, రైతుబంధు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు సరిపోవడం లేదని, భూభారతి విధానంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లోనూ ఆశించిన పురోగతి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, జగదీశ్వర్‌రెడ్డి, నందిమళ్ల అశోక్, కరుణశ్రీ, కృష్ణానాయక్, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

