కలం, కాజీపేట: ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ప్రకటించి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్నా వాటిని నెరవేర్చలేదని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) విమర్శించారు. మంగళవారం కాజీపేట (Kazipet) ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్ (BRS) నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను చిత్తుకాగితంగా మార్చిందని ఆరోపించారు. వైఎస్సార్ గుడిసెవాసులకు పట్టాలు, బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వారిని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారని ప్రశ్నించారు.
పేదల ఇళ్లను కూల్చేందుకు జేసీబీలు పంపడాన్ని తప్పుబట్టారు. బాధితులకు పట్టాలు ఇచ్చే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టడం, 144 సెక్షన్ విధించడం ఏమిటని ప్రశ్నించారు. న్యూ శాయంపేట గుడి, కుడా భూములు, మైనార్టీల భూముల వ్యవహారాల్లోనూ అధికార పార్టీ నేతల తీరుపై ఆరోపణలు చేశారు.
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి (Marri Yadava Reddy) మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలసముద్రంలోని కుడా భూముల వేలంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మార్కెట్ విలువ రూ.1.50 లక్షలుగా ఉన్న భూమిని రూ.65 వేలకే ఎలా విక్రయించారని ప్రశ్నించారు.
కాజీపేట చౌరస్తా కమర్షియల్ భవనం అనుమతుల వ్యవహారంపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వినయ్ భాస్కర్ 15 ఏళ్ల పాలనలో గుడిసెలు తొలగించలేదని, ఇప్పుడు పేదల ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ గుడిసెవాసులకు నాయిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నర్సింగరావు, జోరిక రమేష్, నార్లగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

