కలం, జోగులాంబ గద్వాల: విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులను తొలగించాలని, హాజరు సక్రమంగా నమోదు చేయని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Gadwal Govt Hospital) ని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావాలని, బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. పర్యవేక్షకుల ఛాంబర్ లో కలెక్టర్ ఉద్యోగుల, ఇతర సిబ్బంది హాజరు రిజిస్టర్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత 45 రోజుల హాజరు వివరాలను పరిశీలించి, మాన్యువల్ రిజిస్టర్, ఆన్లైన్, బయోమెట్రిక్ హాజరు వివరాలను సరిపోల్చి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది హాజరు, పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని వారి స్థానంలో ఆమోదిత మెరిట్ జాబితా ప్రకారం తదుపరి అర్హులైన అభ్యర్థులను నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెరిట్ జాబితాలో ఎలాంటి మార్పులు చేయడానికి ఏజెన్సీలకు అధికారం లేదని స్పష్టం చేశారు.
మూడు షిఫ్టుల్లో వైద్య సేవలు అందించాలి
ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఓపి బ్లాక్ వద్దకు వెళ్ళిన కలెక్టర్ అక్కడి ఔట్ పేషెంట్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఇబ్బంది లేకుండా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యనికి ప్రాధాన్యతనివ్వాలి
ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, భద్రతా సిబ్బంది విధులను పటిష్టంగా పర్యవేక్షించాలని, వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రోగుల సహాయకులు పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ కూర్చోకుండా వారికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి కొరత లేకుండా చూడాలని, వాష్‌రూమ్స్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండకుండా పలుచోట్ల భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం, నాణ్యమైన సౌకర్యాలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు ఝాన్సీ లక్ష్మి, ఇతర వైద్యాధికారులు, తదితరులున్నారు.

