కలం, వనపర్తి: పేద కుటుంబాలకు సంక్షేమ భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీకి ప్రాధాన్యమిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Thudi Megha Reddy) అన్నారు. మంగళవారం గోపాలపేట, ఏదుల, రేవల్లి మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో దాదాపు 1,100 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. గోపాలపేటలోని పద్మావతి గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే పంపిణీలో పాల్గొన్నారు. రేవల్లి మండల కేంద్రంలోని రైతువేదికలోనూ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో ప్రతి నెలా సుమారు రూ.11 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో వాటిని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారని తెలిపారు.
కరువు పరిస్థితులపై రైతులు, పేదలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కరువును తీసుకొచ్చిందంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కార్యక్రమాల్లో మార్కెట్‌యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి, ఏదుల మండల అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు సుల్తాన్, జిల్లా నాయకులు పర్వతాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

