బొగ్గు ఉత్పత్తికి వీకే ఖని సిద్ధం

కలం/ఖమ్మం బ్యూరో : సింగరేణి ప్రాంతాల్లోని బొగ్గు గనులు ఒక పక్క వరుసగా మూత పడుతూ కార్మికుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగూడెంలో (Bhadradri Kothagudem) గతంలో మూత బడిన మూడు గనులను అనుసంధానం చేస్తూ ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ గ్రౌండ్ మైన్ ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించింది. మూతపడ్డ పాత మూడు గనుల నుంచి అండర్ మైన్, ఓపెన్ కాస్ట్ విధానాల ద్వారా సుమారు 2,403 హెక్టార్లలో బొగ్గును వెలికి తీసేందుకు సింగరేణి సంస్థకు కేంద్రం ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఫలితంగా శనివారం వెంకటేశ్ ఖని (వీ.కే) పున:ప్రారంభం అయింది. ఈ ఖని 35 ఏళ్ళు వరకూ బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 2వేల మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కూడా లభించనుండటం గమనార్హం.

1954లోనే వెంకటేష్ ఖనిని సింగరేణి సంస్థ గుర్తించి, దశాబ్దాలుగా ఇక్కడ నుంచి బొగ్గును వెలికి తీస్తున్నారు . బొగ్గు నిల్వలు అడుగంటడంతో 2021లో వీ.కే. ఖని మూసేశారు. 1991లో ఇదే ప్రాంతంలో మరో మార్గం గుండా పద్మావతి ఖని -5 పేరున భూగర్భ గనిని ప్రారంభించి బొగ్గును వెలికి తీస్తున్నారు. మరోవైపున గౌతంఖనిని కూడా 2021లోనే మూసేశారు. తాజాగా ఈ మూడు గనులను కలుపుతూ వెంకటేశ్ ఖని పేరిట మెగా ఓపెన్ కాస్ట్ కమ్ అండర్ మైన్ గనిని అందుబాటులో తెచ్చారు.

300పైబడి 450అడుగుల లోతు వరకు బొగ్గును ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వెలికి తీస్తారు. దీంతో పాటు 2030 వరకు నిల్వలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు వీ.కె. 7 మెగా ఓ.సీ. లోని అండర్ మైన్ బొగ్గు ఉత్పత్తిని శనివారం సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ద ప్రకాష్ ప్రారంభించారు.

వెంకటేష్ ఖని లో సీఎండీ సందడి

కొత్తగూడెం (Bhadradri Kothagudem) ఏరియాలోని ఉపరితల, భూగర్భ గనులలో శనివారం సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ద ప్రకాష్ పర్యటించారు. అలాగే వీకే కోల్ మైన్స్ లో మొదటిసారిగా ఉత్పత్తి అయిన బొగ్గు రవాణా చేసే లారీకి పచ్చ జెండా ఊపి బొగ్గు రవాణాను ప్రారంభించారు. తరవాత వికే సిఎం(కోల్ మైన్స్) వ్యూ పాయింట్ నుండి మైన్స్ భౌగోళిక స్థితిని, వికే సిఎం ఉత్పత్తి పనితీరు, భద్రతా చర్యలను పరిశీలించారు. తదుపరి గనుల ప్రాంతాలను పరిశీలిస్తూ కార్మికుల పనితీరును, భద్రతా ప్రమాణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమం సంస్థకు అత్యంత ముఖ్యమని, కార్మికుల ఆరోగ్యం, విద్య, నివాస సదుపాయాల మెరుగుదలకు సింగరేణి యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>