కలం, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని (Silpa Ravi) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించేందుకు ఆయనతో పాటు శిల్పా చక్రపాణి రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వంటి పలువురు కీలక వైసీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శిల్పా రవి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను బయటకు రాకుండా నిలువరించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పోలీసుల నిర్బంధంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమను, పార్టీ జనరల్ ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని కూటమి నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ప్రభుత్వ ఒత్తిళ్లకు, నిర్బంధాలకు తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ తలొగ్గబోరని చెప్పారు. నియోజకవర్గంలోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

