కామన్వెల్త్‌లో షర్మిల చారిత్రాత్మక స్వర్ణం: స్ఫూర్తిదాయక కథ

కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయం దక్కింది. పారా అథ్లెటిక్స్‌లో 20 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. హర్యానాకు చెందిన 40 ఏళ్ల షర్మిలా ధన్‌కర్ (Sharmila Dhankar ) బంగారు పతకం సాధించారు. మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల దూరం విసిరి పసిడి గెలుచుకున్నారు. కామన్వెల్త్ పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దీంతో భారత్ ఖాతాలో మొత్తం ఎనిమిది పతకాలు చేరాయి. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

ఈ పసిడి వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉన్నాయి. షర్మిల పుట్టింది హర్యానాలోని చిత్రౌలి గ్రామం. రెండేళ్ల వయసులోనే పోలియో సోకి కాలు దెబ్బతింది. తండ్రి రైతు, తల్లికి చూపు లేదు. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. 18 ఏళ్లకే పెళ్లి చేశారు. కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని మొదటి భర్త చిత్రహింసలు పెట్టాడు. ఒక రాత్రి నాలుగు గంటల పాటు కొట్టి ఇంటి నుంచి తరిమేసాడు. 26 ఏళ్ల వయసులో పిల్లలతో తల్లిదండ్రుల వద్దకు చేరింది.

ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. 28 ఏళ్ల వయసులో అజిత్ సింగ్‌తో రెండో పెళ్లైంది. ఆయనే ఆమెను పారా క్రీడల వైపు నడిపించారు. ఆట కోసం 2023లో తమ సొంతింటిని కూడా అమ్మేశారు. 34 ఏళ్ల వయసులో ఆమె క్రీడల్లో అడుగుపెట్టారు. తక్కువ కాలంలోనే ప్రతిభ చూపి 2021లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. గ్లాస్గోలో ఇప్పుడు స్వర్ణం సాధించి దేశం గర్వించేలా చేశారు.

ఈ విజయం లభించడం కలలా ఉందన్న ఆమె, తన విజయం వెనుక తల్లి పోరాటం ఉందన్నారు. ఆసియా గేమ్స్‌లో పసిడి గెలవడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మీరాబాయి చాను, షర్మిల స్వర్ణాలు గెలిచారు. రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి, సర్వేష్ రజతాలు సాధించారు. బింధ్యారాణి, ఝాండు కుమార్ కాంస్యాలు గెలుచుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>