కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగానే విద్యా వ్యవస్థ బలహీనపడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ కుమార్ (Damera Kiran) ఆరోపించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 21 నుంచి 25 వరకు నిర్వహించిన “సమరభేరి జీపు యాత్ర” శనివారం స్థానిక పిల్లలమర్రి గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ముగింపు సభతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజురోజుకు బలహీనపడుతోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు విద్యార్థి ఉద్యమాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు సాగిన సమరభేరి జీపు యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 50కిపైగా సంక్షేమ, గురుకుల, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్థలను సందర్శించిందని తెలిపారు. ప్రతి హాస్టల్‌లో విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. యాత్రలో భాగంగా హాస్టళ్లలో నాణ్యతలేని భోజనం, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్లు, పారిశుధ్య లోపాలు, మంచాలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతుల కొరత, అధ్యాపకులు, వార్డెన్లు, ఇతర సిబ్బంది ఖాళీలు వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలలో అధ్యాపకుల కొరతతో బోధన దెబ్బతింటోందని అన్నారు. సంక్షేమ, గురుకుల హాస్టళ్లకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వార్డెన్లు, నాన్-టీచింగ్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను ప్రభుత్వాలు విరమించుకోవాలని అన్నారు. సమరభేరి జీపు యాత్రకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని, సేకరించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముగింపు సభలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా నాయకులు నందు, బాలకృష్ణ, నవ్య హారిక, జ్ఞాపిక, సాయి శివ, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

