కలం, క్రైమ్ బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలా (sp janaki sharmila)పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కిందిస్థాయి ఉద్యోగులు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఎస్పీ తీరుతో తాము మానసిక క్షోభకు గురవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అకారణంగా బదిలీలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎస్పీ చర్యలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తమ గోడు వెల్లబోసుకున్నారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో అక్రమ దందాలు నిర్వహించే వారి దగ్గర డబ్బులు తీసుకొని ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కిందిస్థాయి ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, డీజీపీతో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.
కారణం లేకుండానే బదిలీలు
తాము ఎలాంటి తప్పు చేయకపోయినా బదిలీల పేరిట ఎస్పీ జానకి షర్మిలా (sp janaki sharmila) మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. సక్రమంగా విధులు నిర్వహించినా ఎస్పీకి నచ్చకపోతే వేటు తప్పదని తెలిపారు. ఇలా ఎంతోమంది ఎస్ఐలను పూటకు ఒకరు చొప్పున బదిలీ చేస్తూ ఎస్పీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎస్ఐలతో పాటు తక్కువ జీతానికి పని చేస్తున్న హోంగార్డులను సైతం ఎస్పీ బదిలీల పేరిట ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు.
ఇలా ఎస్పీ కోపానికి 30 మంది హోంగార్డులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారని వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పని చేసే ఓ ఎస్ఐని సుమారు 20 సార్లు బదిలీ చేసి ఇప్పటి వరకు ఒక్క పర్మనెంట్ ప్లేస్ ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నారని లేఖలో వాపోయారు. కనీసం తప్పు చేస్తే బదిలీ చేసినా ఒక అర్థం ఉంటుంది.. కానీ ఏ తప్పు చేయని సిబ్బందిని ఇలా వేధించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఎస్పీ వద్దకు వెళ్లి ఎందుకు బదిలీ చేశారు? అని అడిగితే సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు.
ఎస్పీ తీరుతో పలువురు ఆత్మహత్యాయత్నం
నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా ఎస్పీ తీరు వల్ల ఏమి చెప్పలేక మౌనంగా ఉంటున్నారని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. కొంతమంది సిబ్బంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని ఆరోపించారు. గతంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ని అనవసరంగా బదిలీ చేసి టార్చర్ పెడితే ఆ కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్‌కి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ గుట్టుచప్పుడు కాకుండా ఆ కానిస్టేబుల్ని ప్రస్తుతం తన దగ్గర ఫింగర్ ప్రింట్ విభాగంలో పెట్టుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు సరైన కారణం లేకుండా సుమారు 20 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారని తెలిపారు. ఉద్యోగులు రాసిన లేఖలో ఎస్పీపై అవినీతి ఆరోపణలు సైతం చేశారు. జిల్లా పరిధిలోని ఓ ఎస్ఐతో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఒక ఉన్నతధికారికి గృహ అవసరాల కోసం సుమారు రూ.2-3 లక్షల విలువ చేసే కలపను ఫ్రీగా పంపమని సదరు ఎస్ఐని జానకి షర్మిలా ఆదేశించారని, ఎస్ఐ నిరాకరించడంతో తనను జిల్లా నుంచే వెళ్లగొట్టారని ఆరోపించారు. గతంలో ఓ సీఐని ఎస్పీ సొంత అవసరాలకు వాడుకున్నారని, మాముళ్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జిల్లా నుంచి పంపించేశారని లేఖలో వెల్లడించారు.
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
ఎస్పీపై అవినీతి ఆరోపణలు చేసిన ఉద్యోగులు ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన కొన్ని సంఘటనలను లేఖలో ప్రస్తావించారు. ఎస్పీ అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఓ నాయకుడు నిర్వహించే గుట్కా, మట్కా, గంజాయి లాంటి అవినీతి పనులకు ఎస్పీ డబ్బులు తీసుకొని సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా జిల్లా కేంద్రంలో అక్రమ దందాలు నిర్వహించే వారు సాయి కృష్ణా అనే రిజర్వ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఎస్పీకి డబ్బులు అందిస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లాలో ఇటీవల దొంగతనాలు పెరిగిపోవడంతో ఓ రిపోర్టర్ దొంగతనాలపై పత్రికలో వార్తను రాస్తే ఎస్పీ ఆ రిపోర్టర్‌ను బెదిరించారని లేఖలో వెల్లడించారు. ఎస్పీ తీరుతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తాము ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి ఉద్యోగులు సీఎంతో పాటు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. ఎస్పీని బదిలీ చేయడమే సరైన గుణపాఠం అని వారు లేఖలో పేర్కొన్నారు.

