కలం, న్యూఢిల్లీ: కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చిన వెంటనే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయనుకుంటే.. యాపిల్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. భారత్లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర (iPhone 17 Price) ఏకంగా రూ.17 వేల మేర పెరిగి.. ఇప్పుడు రూ.99,900కు చేరింది. 512జీబీ వేరియంట్ ధర రూ.1,24,900గా ఉంది. ఐఫోన్ 17ఈ ధర కూడా పెరిగింది. ఐఫోన్ ఎయిర్ ధరల్లోనూ భారీ పెంపు కనిపించింది. 1టీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.65 వేల మేర పెరిగి రూ.2,24,900కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మెమొరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరగడం, సరఫరాపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలోనే యాపిల్ ధరలను పెంచినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ధరల పెంపుతో పాటు ‘ఐఫోన్ 17 ప్రో’, ‘ఐఫోన్ 17 ప్రో మాక్స్’లను యాపిల్ అధికారిక లైనప్ నుంచి తొలగించింది. వాటి స్థానంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ కొత్త ప్రీమియం మోడళ్లను తీసుకొచ్చింది.
కొత్త కారు వస్తుంది కదా బ్రో..!
యాపిల్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ ఫీచర్లు, ధరలపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వరద పారుతున్నది. భారత్లో ఈ ఫోన్ బేస్ మోడల్ ధర ఏకంగా రూ. 2,99,900 (దాదాపు రూ. 3 లక్షలు)గా నిర్ణయించడంపై నెటిజన్లు రకరకాల కౌంటర్లు, సెటైర్లతో హోరెత్తిస్తున్నారు. ‘‘అంత ధర పెడితే షోరూమ్ నుంచి కొత్త కారే వస్తుంది కదా బ్రో!’’ అంటూ చలోక్తులు విసురుతున్నారు. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్మితే సరిపోదని, ఈ ఫోన్ కొనాలంటే ‘ఆర్గన్ పోర్ట్ఫోలియో’ మొత్తం సిద్ధం చేసుకోవాలని కొందరు, ‘డ్యుయో’ అంటే రెండు ఉద్యోగాలు, రెండు జీతాలు ఉంటేనే ఈ ఫోన్ ఈఎంఐలు కట్టగలమని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

