24 గంటల కరెంటేదీ?.. రోడ్డెక్కిన రైతులు

కలం, తెలంగాణ బ్యూరో: కరెంట్ కోతలతో రైతులు మళ్లీ ఆందోళనల (Farmers Protest) బాట పడుతున్నారు. ఎల్‌ నినో ప్రభావంతో జల విద్యుత్‌ ఉత్పత్తి లేకపోయినా.. డిమాండ్ తగ్గట్టుగా కరెంటు సరఫరా చేస్తున్నామని విద్యుత్‌ సంస్థలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. గ్రామాల్లో వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ సరిగా అందడం లేదని, కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని,

పంటలకు నీరు పెట్టలేకపోతున్నామని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి, విద్యుత్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించడంతోపాటు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలనే ప్రతిపక్ష బీఆర్ఎస్‌ రాజకీయ మైలేజ్‌ కోసం ఉపయోగించుకుంటుండగా.. తమ పరిధిలోని విద్యుత్‌ సరఫరాపై డిస్కమ్ ఇంజినీర్లు ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

సీఎం ఇలాకాలోనే కష్టాలు..

వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం, అధికారుల ప్రకటనలు ఎలా ఉన్నా.. రైతులు రోడ్డెక్కడం రోటీన్ ప్రాక్టీస్గా మారింది. తాజాగా ముఖ్యమంత్రి సొంత ఇలాకాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై తాండ్ర గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విద్యుత్ సరఫరా లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో రైతులు కరెంటు కోతలకు నిరసనగా ధర్నా చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, వనపర్తి జిల్లాలో పెద్దగూడెం రైతులు సైతం సబ్స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనలన్నీ గురువారం చోటుచేసుకున్నవే.

నాగర్ కర్నూల్ ఘటనపై స్పందించిన దక్షిణ డిస్కం అధికారులు ముఖ్యమంత్రి స్వగ్రామానికి సమీపంలోని ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి 12 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నట్లు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెబుతుంటే.. డిస్కం అధికారులు 12 గంటల సప్లై అని చెప్పడం గమనార్హం.

బీఆర్ఎస్, కాంగ్రెస్.. సేమ్ సీన్

గత ప్రభుత్వంలోనూ వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారు. గ్రౌండ్‌ రియాలిటీ అందుకు భిన్నంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సబ్ స్టేషన్‌కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. రోజుకు సగటున 12 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదని రికార్డుల పరిశీలనలో తేలింది. దీంతో అప్పటి ప్రభుత్వం అప్రమత్తమై రికార్డుల పరిశీలన కార్యక్రమంపై ఆంక్షలు విధించింది.

ఇప్పుడు బీఆర్ఎస్‌ సైతం ఇదే పని చేస్తోంది. ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావు ఆకస్మికంగా ఓ సబ్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. తొమ్మిది గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదని మీడియాకు వివరించారు. దీంతో అధికారులు వెంటనే పూర్తి వివరాలను తెలుసుకుని.. ఆ సబ్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న మరమ్మతులను ప్రస్తావిస్తూ విద్యుత్‌ సరఫరా తగ్గడానికి కారణాలను వివరించారు.

కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం..

గత రెండు మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంతో రైతులు బోరు బావులపై ఆధారపడుతున్నారు. వ్యవసాయ పంపుసెట్లను వాడక తప్పడంలేదు. ఎల్‌ నినో కారణంగా పంటలు ఎండిపోవద్దన్న ఉద్దేశంతో కరెంటు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సమయానికి కరెంటు సప్లై లేకపోవడం, కొన్నిచోట్ల సింగిల్ ఫేజ్ సప్లై మాత్రమే ఉండడం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

ఇటీవల జరిగిన నిరసనలు…

• భువనగిరి జిల్లా సుద్దాల గ్రామంలో నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ రైతులు జులై చివర్లో ధర్నా చేశారు.
• నల్లగొండ జిల్లా తిప్పర్తి సబ్ స్టేషన్ పరిధిలోని ఇంద్లూరు గ్రామంలో విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో చేశారు.
• జగిత్యాల జిల్లా కోరుట్ల సబ్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ రహదారిపై తొమ్మిది గంటలకు మించి విద్యుత్ రావడంలేదని రైతులు ధర్నా చేశారు.
• వరంగల్ జిల్లా మైలారం గ్రామంలో సింగిల్ ఫేజ్ కరెంటు సప్లైతో మోటార్లు చెడిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
• సూర్యాపేట జిల్లా పాలకవీడు సబ్ స్టేషన్ పరిధిలో లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయనంటూ రైతులు ధర్నా చేశారు.
• ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోల్కంపల్లి సబ్ స్టేషన్ పరిధిలో కరెంటు లేక పంపుసెట్లు ఆన్ కావడంలేదని, బోర్ల నీటితో సాగుకు ఇబ్బంది అవుతున్నదని ధర్నా చేశారు.
• సంగారెడ్డి జిల్లా జోగిపేట్-మాసాన్‌పల్లి గ్రామాల మధ్య అన్నాసాగర్ సబ్ స్టేషన్ ముందు నిత్యం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతుల ధర్నాతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.
• ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సబ్ స్టేషన్ను ముట్టడించిన రైతాంగం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ధర్నా… బీఆర్ఎస్ ఎమ్మెల్యే మద్దతు.
• నిర్మల్ జిల్లా కుబీర్, పరిసర గ్రామల రైతులు భైంసా-కుబీర్ రహదారిపై కరెంటు కోతలకు నిరసనగా ధర్నా
• నారాయణపేట్ జిల్లా మక్తల్ పరిసర గ్రామాల రైతాంగం మినీ ట్యాంక్బండ్ దగ్గర రహదారిపై లో వోల్టేజీకి నిరసనగా ధర్నా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>