కలం, స్పోర్ట్స్: ఆసియా కప్ గెలిచినా.. ట్రోఫీ తీసుకోని భారత మహిళల జట్టు నిర్ణయంపై బీసీసీఐ కార్యదర్శి (BCCI Secretary) దేవజిత్ సైకియా (Devajit Saikia) కీలక విషయాలు వెల్లడించారు. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి వస్తే కార్యక్రమానికి హాజరుకాబోమని ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి చెప్పామని తెలిపారు. తమ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. ట్రోఫీని ఆసియా క్రికెట్ మండలి ఉపాధ్యక్షుడు ఖలీద్ చేతుల మీదుగా అందించాలని బీసీసీఐ ప్రత్యామ్నాయం సూచించింది.
కానీ ఆ ప్రతిపాదనకు అంగీకారం రాలేదని సైకియా చెప్పారు. పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఏడాది పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయాన్నే మహిళల జట్టు కొనసాగించిందని వివరించారు. అయితే రెండు ఆసియా కప్ ట్రోఫీలూ భారత్‌కు త్వరలో వస్తాయని సైకియా హామీ ఇచ్చారు. గత ఏడాది పురుషుల జట్టు గెలిచిన ట్రోఫీ కూడా ఇంకా భారత్‌కు చేరలేదని పేర్కొన్నారు.
సాధారణంగా విజేతలకు నిర్వాహక సంస్థలోని ఉన్నతాధికారి ట్రోఫీ అందించడం ఆనవాయితీగా ఉండేదని, గత ఏడాది నుంచి ఆ పద్ధతి కొనసాగడం లేదని ఆయన అన్నారు. మరోవైపు మహిళల జట్టు దృష్టి ఇప్పుడు రాబోయే టి20 ప్రపంచకప్, ఆసియా క్రీడలపై ఉందని సైకియా తెలిపారు. ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యమని చెప్పారు.

