కలం, సారంగాపూర్: ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఆలూరును తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సంకల్పించారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-use plastic) వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు మంగళవారం గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామం (Alur Village) లో సర్పంచ్ ఇర్ల చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మీకాంత్ పాల్గొని గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్
ఈ సందర్భంగా డీపీఓ శ్రీనివాస్ (DPO Srinivas) మాట్లాడుతూ .. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్తబుట్టలను ఇతర అవసరాలకు వినియోగించకుండా పారిశుధ్య నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు ప్రత్యామ్నాయంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారని, గ్రామంలో జరిగే శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఇక్కడి నుంచి వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి లింగయ్య, నాయకులు ఇర్ల విజయ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

