కలం, వెబ్ డెస్క్: యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రతీకార దాడులు ప్రారంభించింది. సనా, తైజ్ పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని పోర్టులపై భీకర దాడులు చేపట్టింది. హౌతీల ఆయుధ కర్మాగారాలు, డ్రోన్ల పరిశ్రమలపై రాకెట్లు ప్రయోగించి ధ్వంసం చేసింది. శనివారం రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు రాకెట్లు దాడి చేయడంతో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటల్లో సౌదీ ఆర్మీ హౌతీలను టార్గెట్ చేసింది. అమెరికా సైతం హౌతీల దాడులపై సీరియస్‌గా ఉంది. వారిని వదిలిపెట్టబోమని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. తాజా దాడులతో ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
తీవ్రంగా ఖండించిన భారత్..
రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి చేసి అమాయకులైన ప్రయాణికులను చంపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. “రియాద్ కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్టుపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇటీవల వరుసగా ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవడంతో పదుల సంఖ్యలో మరణించారు. మృతుల కుటుంబాలకు భారత్ సంతాపం ప్రకటిస్తోంది. ప్రజలు, మౌలిక వసతులపై విచక్షణరహిత దాడులను వెంటనే నిలిపేయాలి. ఈ సమయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం, ప్రజలకు భారత్ సానుభూతిని ప్రకటిస్తోంది. ఘర్షణ వెంటనే నిలిచిపోయి.. శాంతి నెలకొనాలని భారత్ ఆశిస్తోంది” అని పేర్కొంది.

