కలం, వెబ్ డెస్క్: ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupally) లో విషాదం చోటుచేసుకుంది. కిష్టారం అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి చిన్నారులు, గర్భిణులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
బాధితుల కథనం ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం కోసం వండిన పప్పుకూరలో విషపూరిత గన్నేరు ఆకులు కలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భోజనం తిన్న చిన్నారులు, గర్భిణులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై చిన్నారులు, గర్భిణులను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
అయితే, వారి పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు చిన్నారులు, ఇద్దరు గర్భిణుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల ఈసీజీ రిపోర్టుల్లో మార్పులు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

