కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలోని సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరాంసాగర్ జలాశయం నుంచి సరస్వతి కాలువ ద్వారా ఆదివారం సాగునీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు (Nirmal Farmers) సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, పీసీసీ అధ్యక్షుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వారబందీ విధానంలో నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
శ్రీహరి రావు చొరవతో సరస్వతి కాలువకు వచ్చే సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్రు రాంరెడ్డి, శ్రీ గండి రామన్న దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా, మామడ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నరేశ్ రెడ్డి, సంతోష్, నాయకులు బాపయ్య, ప్రతాప్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

