కామన్వెల్త్ గేమ్స్: సాజన్ ప్రకాశ్ అవుట్!

కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026) ఈత పోటీల భారత సీనియర్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్‌కు (Sajan Prakash) నిరాశ ఎదురైంది. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేక పోటీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన హీట్స్‌లో సాజన్ ప్రకాశ్ ఐదో స్థానంలో నిలిచారు. మొత్తం ఫలితాలలో 20వ స్థానానికి పరిమితమై ఫైనల్ రేసు అవకాశాన్ని కోల్పోయారు.

32 ఏళ్ల సాజన్ ఈ రేసును 1:51.99 సెకన్లలో పూర్తి చేశారు. ఆయన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్, జాతీయ రికార్డు 1:46.61 సెకన్లుగా ఉంది. అయితే ఈ టోర్నీలో సాజన్ (Sajan Prakash) తన అత్యుత్తమ ప్రదర్శనకు దూరంగా నిలిచారు. రెండుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయనకు కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా నిరాశలు ఎదురయ్యాయి. గతంలో జరిగిన 50 మీటర్ల బటర్‌ఫ్లై సెమీఫైనల్స్‌తో పాటు 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో కూడా అర్హత సాధించలేకపోయారు.

ఇదే విభాగంలో పోటీ చేసిన మరో భారత యువ స్విమ్మర్ అనీష్ గౌడ 18వ స్థానంలో నిలిచారు. అనీష్ 1:51.64 సెకన్లలో రేసును పూర్తి చేసి సాజన్ కంటే మెరుగైన టైమింగ్ నమోదు చేశారు. తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు 1:51.88 సెకన్లను కూడా స్వల్పంగా మెరుగుపర్చుకున్నప్పటికీ, ఫైనల్‌కు అర్హత సాధించే టాప్-8 జాబితాలో చోటు దక్కలేదు. ఈ విభాగంలో ఇంగ్లాండ్ స్విమ్మర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. జేమ్స్ గై 1:45.69 సెకన్లతో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో ఇంగ్లాండ్ స్విమ్మర్ థామస్ డీన్ 1:47.46 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

మరోవైపు పారా స్విమ్మింగ్ విభాగంలో భారత్‌కు ఊరట లభించింది. పురుషుల S7 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్‌కు చైతన్య విశ్వాస్ కులకర్ణి, సుయాష్ నారాయణ్ జాధవ్ అర్హత సాధించారు. హీట్స్‌లో చైతన్య 32.77 సెకన్లతో నాలుగో స్థానంలో, సుయాష్ 35.35 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచి పతక పోరుకు చేరుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ పారా స్విమ్మింగ్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క పతకం మాత్రమే సాధించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో S9 విభాగంలో ప్రశాంత్ కర్మాకర్ గెలిచిన కాంస్య పతకమే ఇప్పటివరకు ఏకైక పతకంగా ఉంది.

Read Also: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాల జంప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>