కలం, వెబ్ డెస్క్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం (Amalapuram) పట్టణంలో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వర్షం పడుతున్న సమయంలో అమలాపురంలోని మహిపాల వీధిలో ఉన్న ఎం.ఎస్.ఎన్. మూర్తి వ్యక్తి నివాసంలో విపరీతమైన శబ్దంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో భాగం ధ్వంసమైపోగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషయం తెలిసిన తెలిసిన వెంటనే అమలాపురం (Amalapuram) ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనంద రావు మహిపాల వీధిలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. దెబ్బతిన్న భవనాన్ని, పరిసర ప్రాంతాలను ఆయన సమీక్షించి బాధితులకు తక్షణ సహాయం అందించే చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన యువకుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అతనికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద రావు మాట్లాడుతూ.. బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ పేలుడు కారణమా? లేక పిడుగుపాటు వలన ఈ విపత్తు సంభవించిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఫొరెన్సిక్ మరియు పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారని, విచారణ పూర్తయిన వెంటనే అసలు కారణాలు వెల్లడవుతాయని ఆయన వెల్లడించారు.

