కలం మెదక్ బ్యూరో: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Rohith Rao) స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలలు, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని అన్నారు.
మెదక్ పట్టణంలో టీజీటిడబ్ల్యూయూఆర్‌జేసీ (బాలికల) కళాశాలలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించనున్న హాస్టల్ భవనం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, యార్డ్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తామని చెప్పారు.
మెదక్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధికే వినియోగిస్తామని తెలిపారు. ఈ కళాశాలకు భవిష్యత్తులో మరిన్ని అవసరాలు ఉన్నా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.

