కలం, నిర్మల్: డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, అధునాతన సాంకేతిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT Basar), కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నీలిట్ (NIELIT) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్, బ్లెండెడ్ లెర్నింగ్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ సర్టిఫికేషన్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అత్యాధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. నీలిట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ డాక్టర్ లక్ష్మణ్ కొర్ర మాట్లాడుతూ డిజిటల్ లెర్నింగ్, వర్చువల్ ల్యాబ్స్ ద్వారా సాంకేతిక విద్యను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం సాధించేలా శిక్షణ కార్యక్రమాలను అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

