కలం, వెబ్ డెస్క్: ఓట్లు లెక్కిస్తున్న కౌంటింగ్ సిబ్బందికి ఓటర్లు షాకిస్తున్నారు. తమతమ సమస్యలను లేఖ (Letter)ల రూపంలో రాసి బ్యాలెట్ బాక్సు (Ballot Box)ల్లో వేశారు. ఇది చూసిన కౌంటింగ్ సిబ్బంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అటు కరీంనగర్‌లో డంపింగ్ యార్డ్ సమస్యపై ఓ లేఖ లభ్యమవగా సూర్యాపేటలో బ్యాలెట్ బాక్స్‌లో మరో లేఖ లభ్యమైంది. సూర్యాపేట (Suryapet)లోని 47 వార్డులో ఓ రిటైర్డ్ ఉద్యోగి తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖ రాసి బ్యాలెట్ బాక్సులో వేశాడు. ఓ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమా.. మేం రిటైర్ అయి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఒక్క పైసా కూడా రాలేదు. రిటైర్ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూ, అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నారని వెల్లడించారు. ఇప్పటికే 62 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని లేఖలో తెలిపారు. ఇంకా మిగిలిన వాళ్లు కూడా బాధతో చనిపోక ముందే తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.


