కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా సాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం విజయదశమి (Vijayadashami) వేడుకతో ముగియనున్నాయి. పితృ అమావాస్య అనంతరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేడు జరుగనుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారి చీరల వేలం, అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేసి నిమజ్జనం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి, భద్రతలు కాపాడేందుకు పోలీస్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అటు ఏపీలోని ప్రముఖ దేవీ క్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరిరోజైన విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నేటితో నవరాత్రి ఉత్సవాలు పూర్తి కానుండటంతో ఇంద్రకీలాద్రి కొండపైకి భక్తులతోపాటు వేలాది సంఖ్యలో భవానీలు రానున్నారు. భవానీలు కిక్కిరిసిపోవడంతో ఇంద్రకీలాద్రి ఎరువువర్ణ శోభతో మెరిసిపోనుంది. భక్తులు విశేష సంఖ్యలో రానుండటంతో నేటి తెల్లవారుజామున 2:30 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉ.10:30 గంటలకు ఉత్సవాల మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగనుంది.
లక్షలాదిమంది భక్తులు కొండపైకి రానుండటంతో ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా చూస్తున్నారు. అలాగే ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు. అలాగే శ్రీశైలం, శ్రీ కాళహస్తి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
అటు తెలంగాణలోని వరంగల్ భద్రకాళీ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నేటితో ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక అవతారాల్లో దర్శనమిస్తున్న భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. 8 వ రోజు మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు.. చివరిరోజైన నేడు మహిషాసురమర్దినీ అవతారంలో భక్తుల దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలు ముగింపు దశకు చేరడంతో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం చేయనున్నారు. ఈ వేడుకకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించనున్నారు.
అటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం, ఏడుపాయల వనదుర్గ ఆలయం, బాసర జ్ఞానసరస్వతి, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి దేవాలయాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

