కలం, కరీంనగర్ : భారత న్యాయరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి దివంగత రామ్ జెఠ్మలానీకి (Ram Jethmalani) కరీంనగర్లో ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలకు గుర్తుగా జస్టిస్ కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శనివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పుల్లిచెర్ల సామ్ కోషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ హాజరయ్యారు. రామ్ జెఠ్మలానీ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ, ప్రముఖ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్ జెఠ్మలానీ న్యాయరంగానికి అందించిన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు.
న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. న్యాయం పట్ల నిబద్ధత, నిర్భయమైన వాదనా పటిమ భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ విగ్రహం న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులకు రాజ్యాంగ విలువలు, న్యాయ స్వాతంత్ర్యం, వృత్తిపరమైన అంకితభావం పట్ల స్ఫూర్తినిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె. జలజ, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, పలువురు సీనియర్ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

