కలం, హనుమకొండ: ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి(Rajender Reddy) అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన సెమినార్ హాల్‌ను శనివారం ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. కళాశాలకు అదనపు తరగతి గదులు, విద్యార్థినుల హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని, అనంతరం సమాజానికి తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

