గార్డు నుంచి బాక్సింగ్ స్టార్‌గా సుమిత్ కుందు

కలం, స్పోర్ట్స్ : స్కూల్‌కు గార్డుగా పనిచేసిన యువకుడు.. ఇప్పుడు అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సుమిత్ కుందు (Sumit Kundu) ప్రయాణం ఎన్నో కష్టాలతో సాగింది. తాజా అప్‌డేట్‌లో 70 కేజీల విభాగంలో ఆసియా క్రీడల భారత జట్టులో సుమిత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హర్యానాలోని జింద్ జిల్లా ధకల్ గ్రామానికి చెందిన సుమిత్ 2013లో బాక్సింగ్ మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించేందుకు తల్లి టైలరింగ్ పనులు చేసేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి సుమిత్ బాక్సింగ్‌కు దూరమయ్యాడు.

స్కూల్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేశాడు. తన కలను పక్కనపెట్టి కుటుంబానికి అండగా నిలిచాడు. అయితే గ్రామ పెద్దలు సుమిత్ ప్రతిభను గుర్తించారు. అతడికి ఆర్థికంగా సాయం చేశారు. ఆహారం, శిక్షణ ఖర్చులను భరించారు. దీంతో సుమిత్ మళ్లీ బాక్సింగ్‌లోకి వచ్చాడు. 2018లో నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. 2019లో ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ స్వర్ణం గెలిచాడు. 2021లో తొలి ప్రయత్నంలోనే సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచాడు. 2022లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు.

స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత జాంబులాట్ బిజమోవ్‌ను ఓడించాడు. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. క్రీడా ప్రతిభతో ఆర్మీలో హవిల్దార్‌గా చేరాడు. అయితే కెరీర్ కీలక దశలో భారీ గాయం తగిలింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ సమయంలో మోకాలికి ACL, మెనిస్కస్ గాయాలయ్యాయి. దాదాపు రెండేళ్లు బాక్సింగ్‌కు దూరమయ్యాడు. ముంబైలో సుమారు ఏడాదిన్నర పాటు పునరావాస శిక్షణ తీసుకున్నాడు. మళ్లీ బాక్సింగ్ చేయగలనా అనే సందేహాలు కూడా వచ్చాయి.

చిన్ననాటి కోచ్ వేద్ ప్రకాశ్, కుటుంబం, ట్రైనర్ల సహకారంతో తిరిగి బలంగా నిలిచాడు. 70 కేజీల విభాగంలో తిరిగి పోటీలోకి వచ్చాడు. జాతీయ సెలెక్షన్ ట్రయల్స్‌లో వరల్డ్ కప్ గోల్డ్ మెడలిస్ట్ హితేశ్ గులియాను సెమీఫైనల్లో ఓడించాడు. ఫైనల్లో దీపక్‌ను ఓడించి కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు బెర్త్ సాధించాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల ఎంపికలో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా సుమిత్ కుందు 70 కేజీల భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నాడు. ఈ పరిణామంతో అతడి కమ్‌బ్యాక్ ప్రయాణం మరో కీలక దశకు చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>