కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో రూ.300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు అవుతున్న గోద్రేజ్ అగ్రోవెట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌కు (Godrej Oil Palm Project) గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పునాది పడిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మిషన్ మోడ్‌లో విస్తరించేందుకు చర్యలు చేపట్టామని, రైతులకు అధిక ఆదాయం కల్పించడంతో పాటు దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ఆయిల్ పామ్ రంగానికి బలమైన పునాది వేశామని పేర్కొన్నారు.
నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు తాను ప్రత్యేక చొరవ తీసుకుని గోద్రేజ్ గ్రూప్‌తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు స్వయంగా శంకుస్థాపన చేసినట్లు పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించామని, అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ కృషి ఫలితంగానే ఖమ్మం జిల్లాలో ఈ ఫ్యాక్టరీ రూపుదిద్దుకుంటోందని అన్నారు.
వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. భారతదేశం వంటనూనెల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్ పామ్ వంటి ప్రాజెక్టులు కీలకమని, తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అప్పట్లోనే చర్యలు ప్రారంభించామని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

