వికాసం కాదు.. విధ్వంసం : కాంగ్రెస్‌పై పువ్వాడ ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, వికాసం చేపట్టడం చేతకాక విధ్వంసానికి పాల్పడుతోందని బిఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు.  కూల్చివేతలే ఆ పార్టీ ముఖ్య ఎజెండాగా మారిపోయాయని ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బుధవారం ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో బాధితుల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆయన హాజరై, బాధితులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదలకు కొత్తగా ఇళ్లు కట్టించి ఇచ్చిన సందర్భాల కంటే, ఏదో ఒక నెపంతో ఉన్న ఇళ్లను కూల్చివేసిన ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్ట కొట్టి, వారి జీవనోపాధిని దెబ్బతీసే ఇటువంటి ప్రజావ్యతిరేక చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించి ఈ కూల్చివేతల ఆలోచనను విరమించుకోవాలని ఆయన (Puvvada Ajay) డిమాండ్ చేశారు.

​తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో ఎంతోమంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు గృహ వసతి కల్పించి అండగా నిలిచామని పువ్వాడ గుర్తుచేశారు. నాడు పేదలకు నివాసాలు కల్పించడం తమ ప్రభుత్వ సాధనకు నిదర్శనమైతే, నేడు ఉన్న ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేయడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మలకి మిగిలిన ఘనత అని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ నగర్ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>